ప్రధాని మోదీ మంగళవారం ఉదయం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆమెతో మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల హైదరాబాద్‌లో షర్మిల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు, అందుకు దారితీసిన పరిణామాల గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటన పట్ల షర్మిలకు సానుభూతి తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా కారులో ఉండగానే ఆమెను టోయింగ్ వాహనంతో ఠాణాకు తరలించడం దారుణమని అన్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్రతోపాటు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా.. ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా షర్మిలను ప్రధాని ఆహ్వానించినట్లు తెలిసింది. అంతకుముందే షర్మిల హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తనపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పందించిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమంటూ చాలా మంది సానుభూతి, మద్దతు తెలిపారని షర్మిల అన్నారు. స్పందించకుండా బాధపడ్డ వారు కూడా ఎంతో మంది ఉన్నారంటూ... అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.