ఏపీలోని నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం ఈ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి రైతులకు అందజేస్తోంది. శ్రీగంధం, ఎర్రచందనం సాగుకు నీరు నిలవని మెట్టభూములు అనుకూలంగా ఉంటాయి. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. సాగు ఖర్చు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు అవుతుంది.
శ్రీగంధం చెక్క ధర ఒక కిలో ధర రూ.8 వేల నుంచి రూ.16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్ల తరువాత ఒక్కో చెట్టు నుంచి 15-20 కిలోల వరకు చెక్క లభిస్తుంది. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా. ఎర్రచందనం చెట్లు 15 ఏళ్ల వయసు తరువాత గరిష్టంగా 20 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ-గ్రేడు దుంగలకు టన్ను ధర రూ.60 లక్షలు, బి-గ్రేడు ధర రూ. 40 లక్షలు, సీ-గ్రేడు ధర రూ. 31 లక్షలుగా నిర్ణయించారు. దీంతో రూ.కోట్లలో ఆదాయం పొందే అవకాశం ఉంది.