ఏపీలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏపీలో మాత్రం ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విక్రయించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదని మరోసారి స్పష్టమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మక విక్రయానికి సంబంధించి.. అడుగులు ముందుకే పడుతున్నాయని.. దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్ సమ్మిట్‌లో పాండే దీనిపై క్లారిటీ ఇచ్చారు. అటు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ టైంలో పాండే ప్రకటన కీలకంగా మారింది.
'రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లో కేంద్రానికి ఉన్న 100 శాతం వాటాలను వ్యూహాత్మకంగా విక్రయించేందుకు.. 2021 జనవరిలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఈ విషయంలో మేం ముందుకే వెళ్తున్నాం. ప్రస్తుతానికి లావాదేవీ నిర్మాణం ఎలా అనే దానిపై పనిచేస్తున్నాం' అని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అటు కార్మికుల్లో ఆందోళన మరింత పెరిగింది. దీనిపై కార్మికులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే బదులు.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. అందుకు ఆర్థిక మంత్రిత్వ నిరాకరించింది. వ్యూహాత్మకమైన వాటిని వ్యూహాత్మకం కాని వాటిలో విలీనం అనే ప్రశ్నే ఉండబోదని స్పష్టం చేసింది. దీంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు మద్దతు ప్రకటించాయి.