14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బీసీలకు చంద్రబాబు ఏం చేశారో.. మూడు సంవత్సరాల కాలంలో సీఎం వైయస్ జగన్ ఏం చేశారనే అంశంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా..? అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాలనలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క వ్యక్తికైనా రాజ్యసభ సీటు ఇవ్వగలిగావా..? అని నిలదీశారు. 14 సంవత్సరాల కాలంలో బీసీలను టీడీపీ ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో గానీ భాగస్వామ్యులను చేయగలిగావా..? దమ్ముంటే లిస్ట్ తీయాలని చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. మూడు సంవత్సరాల కాలంలో మా లీడర్, సీఎం వైయస్ జగన్ 85 వేల మంది బీసీలను ప్రజాప్రతినిధులుగా తయారు చేశారని చెప్పారు. జయహో బీసీ మహాసభ సక్సెస్‌ను చూసి చంద్రబాబుకు అసూయ, ద్వేషం పెరిగిపోయిందన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, కించపరిచేలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు.