గుంటూరులో నారా హమారా సభలో పథకాల కోసం ప్రశ్నించిన ముస్లిం యువతపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టింది ఇంకా ముస్లిం సమాజం మరిచిపోలేదని కర్నూలు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ముస్లిం మైనార్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నాడన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన కొడుకు లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసిన చంద్రబాబు.. ముస్లిం సామాజికవర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న మైనార్టీ నాయకులనే గుర్తించి గౌరవించలేని చంద్రబాబుకు.. ఇప్పుడు మైనార్టీలపై ప్రేమ పుట్టుకొచ్చిందా..? అని నిలదీశారు. మైనార్టీలపై చంద్రబాబు ప్రేమ ఏపాటిదో ముస్లిం మైనార్టీ సామాజికవర్గంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు. టీడీపీ హయాంలో ముస్లిం సంక్షేమంపై ఎంత ఖర్చు చేశారో చెప్పండి.. మా ప్రభుత్వంలో ఏం చేశామన్నది చెబుతాం.. దమ్ముంటే చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడారు.