ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఢిల్లీ ఉపాధ్యక్షుడు, మరో ఇద్దరు కౌన్సిలర్లు కొన్నిగంటలకే మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ, ఇద్దరు కౌన్సిలర్లు సబీలా బేగం, నజియా ఖాతూన్ లు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం వేకువజామున వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలీ మెహదీ ట్వీట్ చేస్తూ తాను రాహుల్ గాంధీ కార్యకర్తనని తెలిపారు. వీరు ముగ్గురు శుక్రవారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ మారుతున్నట్లు మెహదీ ప్రకటించగానే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరిగి పార్టీలోకి వచ్చిన మెహదీకి పార్టీ నేతలు ఆన్లైన్ ద్వారా తమ మద్దతు తెలిపారు.