పింగళి సూరన కళాపూర్ణోదయంపై ‘కవిత్వతత్వ విచారం’ అనే తొలి విమర్శ గ్రంథాన్ని రచించిన విమర్శనా విపంచి డా. కట్టమంచి రామలింగారెడ్డి అని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం బహుముఖ ప్రతిభాశాలి కట్టమంచి రామలింగారెడ్డి 143వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సిబ్బంది, పాఠకులు కలసి కట్టమంచి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం పరిశోధన కేంద్రం బాధ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సాహితీవేత్తగా, పాలనాదక్షుడుగా, రాజకీయవేత్తగా, గొప్పవక్తగా రాణించిన బహుముఖ ప్రతిభాశాలి డా. కట్టమంచి రామలింగారెడ్డి అన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి సి. పి. బ్రౌన్ రచించిన ‘హండే అనంతపురం’ చరిత్ర ఆధారం చేసుకొని ‘ముసలమ్మ మరణం’ కావ్యాన్ని రచించారని, సాహిత్య చరిత్రలో తొలి ఆధునిక కావ్యంగా స్థానం సంపాదించుకుందని అన్నారు.
చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో జన్మించడం వల్ల ఆ పేరుతోనే ప్రసిద్ధులయ్యారని అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి ఉపాధ్యక్షులుగా పనిచేసి ఉన్నతవిద్యలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని అన్నారు. సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా. చింతకుంట శివారెడ్డి, గ్రంథపాలకులు ఎన్. రమేశ్ రావు, రచయిత కొత్తపల్లె రామాంజనేయులు, పాఠకుడు రంగాలు ప్రసంగించారు. కార్యక్రమంలో సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం గ్రంథపాలకులు జి. హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్. వెంకట రమణ, మౌనిక, పాఠకులు పి. మధుసూదన్ రెడ్డి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.