మనదేశంలోకి స్వదేశీ వాహనాలతోపాటు విదేశీ కంపెనీల వాహనాలు సైతం దిగుమతి అవుతున్నాయి. ఇదిలావుంటే జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తోంది. ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బీఎండబ్ల్యూ ఆవిష్కరించింది. బీఎండబ్ల్యూ పోర్ట్ ఫోలియోలో ఇదే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని వచ్చే ఏడాది జనవరి మాసంలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.
బీఎండబ్ల్యూ సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 8.9 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది 42 హార్సపవర్ లేదా 31 కిలోవాట్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలోనే 50 కిమీ వేగం అందుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కిమీ ప్రయాణించవచ్చని బీఎండబ్ల్యూ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్లు. దీంట్లో బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు 2.3 కిలోవాట్ చార్జర్ తో 100 శాతం చార్జింగ్ కు 4 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. అదే, 6.9 కిలోవాట్ చార్జర్ ఉపయోగిస్తే చార్జింగ్ సమయం 1 గంట 40 నిమిషాలకు తగ్గిపోతుందని బీఎండబ్ల్యూ వెల్లడించింది.
సీఈ-04ను ఎకో, రోడ్, రెయిన్ పేరిట మూడు వేరియంట్లలో తీసుకువస్తున్నారు. ఈ అల్ట్రా మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 10.25 అంగుళాల టీఎఫ్ టీ టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంది. కుదుపుల్లేకుండా ప్రయాణించేందుకు 35 ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ పొందుపరిచారు. దీని ఎక్స్ షోరూమ్ ధరల వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.