భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా పెళ్లయిన మూడు నెలలకే భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గాజువాకలోని శ్రీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... మల్కాపురంలోని జైఆంధ్ర కాలనీకి చెందిన పి.రూపేశ్ (27)కు అదే ప్రాంతానికి చెందిన జానకితో మూడు నెలల కిందట వివాహమైంది. వీరు శ్రీనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే వివాహమైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జానకి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన రూపేశ్ ఇంట్లోని ఫ్యాన్ హుక్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.