నాసా చేపట్టిన మానవరహిత ఆర్టెమిస్-1 యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పయనమైన ఒరాయన్ క్యాప్సూల్ జాబిల్లిని చుట్టి, అనుకున్న రీతిలో ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. నవంబరు 16న దీన్ని నింగిలోకి పంపగా, మెక్సికోకు చెందిన గ్వాడాలూప్ దీవి సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.10 గంటలకు ఈ వ్యోమనౌక దిగింది. మొత్తం మీద ఒరాయన్ 14 లక్షల మైళ్లు ప్రయాణించింది. పుడమి నుంచి 4.32 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లింది. మానవ రవాణా యోగ్యత ఉన్న ఒక వ్యోమనౌక ఇంత దూరం వెళ్లడం ఇదే మొదటిసారి. అపోలో-17 పేరిట చివరిసారిగా మానవులు చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పరిణామం జరగడం విశేషం.