విశాఖపట్నం, నగరంలో గంజాయి గుప్పు మంటోంది. ఏజెన్సీలో విరివిగా లభ్యం కావడం, నగరంలో వినియోగం పెరిగిపోవడంతో దీనిని లాభసాటి వ్యాపారంగా మార్చుకుని, యువత గంజాయి రవాణా వైపు మొగ్గుచూపుతున్నారు. పోలీసులు నిత్యం దాడులు చేస్తున్నా... వారి కళ్లుగప్పి నిర్దేశించిన ప్రదేశాలకు దర్జాగా తరలించేస్తున్నారు. పక్కా సమాచారంతో జరిగిన దాడుల్లో మాత్రమే కొందరు నిందితులు పట్టుబడుతున్నారు. ‘ఈనెల నాలుగున బీచ్‌లో జరిగిన నేవీడే విన్యాసాలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హాజరవడంతో ముందురోజు పోలీసులు నగరంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం కూడలిలో ఒక మారుతివ్యాన్‌ను పోలీసులు తనిఖీ చేయగా గంజాయి వాసన రావడంతో సునిశితంగా పరిశీలించారు. అయినా ఏమీ లభించకపోవడంతో వాహనం కిందిభాగాన్ని నిశితంగా పరిశీలించగా ప్రత్యేక అరలో 20 కిలోల గంజాయిని గుర్తించారు. వాహనంలో ఉన్న ఢిల్లీకి చెందిన ఇద్దరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.’