ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్నాళ్లుగా విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. వేలాది సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణాలు చేస్తుండటం రద్దీకి ఓ కారణమైతే, చెకిన్, చెకౌట్ సమయాల్లో విపరీతమైన ఆలస్యం జరగడంపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం విమానాశ్రయంలోని టెర్మినల్ 3ని ఆకస్మికంగా సందర్శించారు. విమానాశ్రయ అధికారులతో మాట్లాడి, వారికి తగిన సూచనలు చేశారు. కొన్ని రోజుల కిందటే దేశంలోని ప్రధాన విమానాశ్రయాల అధికారులు, మేనేజ్‌మెంట్ బోర్డులతో సింధియా సమావేశమై ఈ విషయంపై చర్చించారు.