పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నగరంలోని మావుళ్లమ్మ 59వ వార్షిక మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని అలంకరించే నిమిత్తం ఈనెల 15వ తేదీ నుంచి అమ్మవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు తంగిరాల దత్తాత్రేయ శర్మ పర్యవేక్షణలో కళాపకర్షణ జరుగుతుందన్నారు. అనంతరం అమ్మవారి దర్శనం నిలిపివేస్తామని తెలిపారు. ఆరోజు నుంచి 28వ తేదీ వరకు ఆలయం వెనుక భాగంలో అమ్మవారి ఉత్సవ మూర్తి దర్శనం, యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 29న ఉదయం 11 గంటలకు అమ్మవారికి కళాన్యాసం అనంతరం భక్తులకు అమ్మ వారి పునఃదర్శనం కల్పిస్తారని, భక్తులు సహకరించాలని కోరారు.