ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన పార్కులు, ఓపెన్‌స్పేస్‌లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆయా స్థలాలు ప్రజలకు ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్ని అందించేందుకు ఉపయోగించుకోవాలి. ఆ మేరకు జీవీఎంసీ గతం నుంచి పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు వంటివి చేపడుతూ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా పార్కులు, ఓపెన్‌స్పేస్‌లలో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట విశాఖపట్నం , విశాలాక్షి నగర్‌లో బీచ్‌రోడ్డుకు సమీపాన గల ఓపెన్‌స్పేస్‌లో సచివాలయం నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు సన్నద్ధం కాగా, టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు. తాజాగా 16వ వార్డు పరిధి హెచ్‌బీ కాలనీలో అబ్దుల్ కలామ్ పార్కులో వార్డు సచివాలయం నిర్మాణానికి జీవీఎంసీ అధికారులు ఈనెల తొమ్మిదిన శంకుస్థాపన చేశారు. దీనికి స్వయంగా మేయర్ గొలగాని హరివెంకటకుమారి హాజరై భూమిపూజ చేయడం ఆశ్చర్యకరం. పార్కులను పరిరక్షించేందుకు కృషిచేయాల్సిన మేయరే పార్కులో సచివాలయం భవన నిర్మాణానికి పూజ చేయడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.