పర్యావరణ పరిరక్షణ కోసం పలు రకాలుగా వివిధ సంస్థలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణ కోసం ఎంత అవగాహణ కల్పిస్తున్నా పెద్ద ప్రయోజనం ఉండడం లేదు. ఇష్టమొచ్చినట్టు చెట్లు కూల్చేస్తూనే ఉన్నారు. అడవులను నాశనం చేస్తూనే ఉన్నారు. దీనిపై ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నా... ఫలితం మాత్రం ఉండడం లేదు. పర్యావరణ పరిరక్షణ కోసం కెనడాలో మాట్రియెల్ నగరంలో కొందరు వినూత్నంగా నిరసన తెలియజేశారు.
వందలాది సంఖ్యలో పర్యావరణ యాక్టివిస్టులు చెట్లు, పక్షులు, నాలుగు కొమ్ముల జింక మాదిరిగా డ్రెస్‌లు వేసుకుని మాంట్రియల్ వీధుల్లో ర్యాలీ తీశారు. ఈ ఏడాది మాంట్రియెల్‌లో కాప్-15 జీవ వైవిధ్య సదస్సు జరుగుతోంది. రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులో 193 ప్రపంచ నాయకులు పాల్గొంటున్నారు.
అయితే జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ నాయకులు తీసుకునే నిర్ణయాలు, చర్యలు సరిపోవని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో యాక్టివిస్టులు వినూత్నంగా నిరసన తెలియజేయాలనుకున్నారు. అందుకే వారంతా చెట్లు, పక్షులు రూపాల్లో తయారై ర్యాలీ తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ర్యాలీని ప్రపంచవ్యాప్తంగా పౌర ఉద్యమాలు చేసే ఆవాబ్ అనే సంస్థ నిర్వహించింది.
గత కాప్ సదస్సులో పర్యావరణాన్ని కాపాడే చర్యలు తీసుకోవడంలో దేశాధినేతలు విఫలం అయ్యారని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ర్యాలీలో పాల్గొన్నవాళ్లు ఆరోపించారు. ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి రాకపోవడం వల్ల 10 లక్షల మొక్కలు, కీటకాలు, జంతువులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయని అన్నారు. ఇదిలా ఉండగా కాప్-15 సదస్సులో 24 అంశాల మీద చర్చించనున్నట్టు తెలుస్తుంది.