గుంటూరు జిల్లా, తెనాలిలోని అన్న క్యాంటీన్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్ధ రాత్రి 12 గంటల సమయంలో అన్న క్యాంటీన్ తలుపు దగ్గర దుండగులు నిప్పు పెట్టి పరారయ్యారు. అటుగా వెళుతున్న కొందరు గమనించి మంటలను ఆర్పి.. పోలీసులకు సమాచారం అందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అన్నా క్యాంటిన్ వాడుకలో లేక ఖాళీగా ఉంటోంది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం ఇచ్చిన తమపై దురుసుగా ప్రవర్తించడం ఏంటని టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.