జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట జలాశయం నుంచి మైలవరానికి 9 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేసినట్లు జలవనరుల శాఖ డీఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. అనంతపురం జిల్లా చాగళ్లు రిజర్వాయర్ నుంచి 8 వేలు, చిత్రావతినది ద్వారా 1, 200 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. గండికోట జలాశయం పూర్తి సామర్థ్యం 26. 85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26. 6 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జలాశయంలో నీటిమట్టం పెరగకుండా నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మైలవరం జలాశయంలో ప్రస్తుతం 5. 9 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఎగువ నుంచి వస్తున్న వేల క్యూసెక్కుల నీటిని గేట్లు ఎత్తి పెన్నానదికి విడుదల చేస్తున్నట్లు డీఈఈ నరసింహమూర్తి తెలిపారు. పెన్నానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.