అటవీశాఖాధికారి వేసిన ఓ ప్రయివేట్ కేసు విచారణలో భాగంగా తెలంగాణ ఎస్పీ, కడప ట్రాఫిక్ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులు సోమవారం మైదుకూరు కోర్టుకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 2009 అక్టోబరు 9న అప్పటి మైదుకూరు డీఎస్పీ కోటిరెడ్డి, సీఐ బాలస్వామిరెడ్డి, పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో చెన్నైకి చెందిన రంగనాథన్ రామనాధం, చిత్తూరుకు చెందిన ఎస్.మహ్మద్‌కాలిక్, బి.మఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన పుట్టా ఓబయ్య, పోరుమామిళ్లకు చెందిన పెద్దిరెడ్డి నారాయణరెడ్డితో పాటు అప్పటి మార్కాపురం డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (డీఆర్వో) వీరస్వామిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 60 ఎర్రచందనం దుంగలు, నగదు, సుమో వాహనం స్వాధీనం చేసుకున్నారు. కాగా తనను అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేశారంటూ డీఆర్వో వీరస్వామి బెయిల్‌పై వచ్చిన అనంతరం 2009 నవంబర్‌లో మైదుకూరు కోర్టులో ప్రయివేట్ కేసు దాఖలు చేశారు. ఈ కేసును 25 జూన్ 2014న కోర్టు విచారణకు స్వీకరించింది. అప్పటి డీఎస్పీ కోటిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. అలాగే అప్పటి సీఐ బాలస్వామిరెడ్డి ప్రస్తుతం కడప ట్రాఫిక్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరితో పాటు రిటైర్డ్ ఎస్‌ఐ శివశంకర్, డీఎఫ్‌వో ఖాదర్‌వలీ, కానిస్టేబుళ్లు రామసుబ్బారెడ్డి, సుధాకర్, రమణ సోమవారం మైదుకూరు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను జడ్జి మొహిద్దీన్ జనవరి 4కు వాయిదా వేశారని న్యాయవాదులు తెలిపారు.