తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెలాఖరున నెల్లూరు జిల్లాకు రానున్నారు. 28వ తేదీన కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో, 29న కావలి, 30న కోవూరు నియోజకర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు రూట్‌మ్యాప్‌ను ఒకటి, రెండు రోజుల్లో జిల్లా పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే చంద్రబాబు జిల్లా పర్యటనకు రావాల్సి ఉంది. మినీ మహానాడుకు ఏర్పాట్లకు సన్నాహాలు పూర్తి కావస్తున్న దశలో తుఫాను కారణంగా బాబు పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు ‘‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు సామాన్య ప్రజలతో ఎక్కువ సేపు గడపడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వివిధ సామాజిక వర్గాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి కష్టసుఖాలను తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించనున్నారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా ఆస్తులను, ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో రెండు, లేదా మూడు ప్రధాన కూడళ్లలో చంద్రబాబు రోడ్‌షో, బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు.