ఏడాది క్రితం తనపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఒంగోలుకు చెందిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తా డిమాండ్ చేశారు. తనపై దాడి జరిగి ఏడాది గడిచిన నిందితులను ఇం తవరకు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జిలతో బుధవారం కలెక్ట రేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.... తన పై దాడి చేసిన వారిని చట్టరీత్యా అరెస్టు చేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రోద్బలంతోనే తనపై దాడి జరిగింద న్నారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల రోజున తనపై దాడి జరిగినా పట్టించుకోలేదన్నారు. ఏడాది క్రితం తన ఇంటిపై 25మందికిపైగా గుండాలు దాడిచేయగా, తాను భయపడి గుంటూరులోని ఒక లాడ్జిలో ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి దాడి చేశారన్నారు. ఒంగోలు డీఎస్పీ అండతోనే తనపై దాడి చేశారని గుప్తా ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా ఆధారాలతో చూపినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. తనపై దాడిచేసిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉండగా తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు కూడా పంపారన్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.