డివైఎఫ్ఐ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితి రెండు సంవత్సరాలు పెంచుతున్నట్లు ప్రకటించడం పట్ల డివైఎఫ్ఐ జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ శనివారం ప్రొద్దుటూరు కార్యాలయం నందు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ నవంబర్ 28న ఎస్సై 411, పోలీసు కానిస్టేబుల్ 6100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని నాలుగు సంవత్సరాల తర్వాత పోలీసు శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసిందని ఇందులో ఎటువంటి వయోపరిమితి పెంచలేదని తెలిపారు. గత నాలుగేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు తమకు న్యాయం చేయాలని రోడ్డుమీదకు వచ్చి పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. డివైఎఫ్ఐ నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి అనేక రూపాల్లో ఆందోళనలు నిర్వహించిందని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసనలు, ఆందోళనలు నిర్వహించింది. ఆలస్యంగా నైన స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు గానీ మీరు పెంచిన రెండేళ్ల ఏ మాత్రం సరిపోదని మరో మూడేళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేకపోవడం అంతకంటే ముందు కూడా చాలా తక్కువ ఉద్యోగాలే భర్తీ కావడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఇంకా వయసు సరిపోదు అనే కారణంతో ప్రస్తుతం నోటిఫికేషన్ కి దూరం అవుతారని కావున వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంకో 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచాలని, భారీ సిలబస్ ఉండి చాలా తక్కువ సమయం పరీక్షకు ఉంది కాబట్టి తక్షణమే పరీక్ష గడువును నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి కనీసం 3 నెలలు గడువు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లక్షలాది మంది నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే వయోపరిమితిని మరో మూడేళ్లకు, పరీక్ష గడువును మరో నెలకు పెంచాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్ఐ నిరుద్యోగులను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజ్ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వెంకటేష్, సుబ్బారావు పాల్గొన్నారు.