కరోనా ఆంక్షలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. అయితే ఇప్పటికే చైనాలో లక్షల కొద్ది కేసులు నమోదవుతుండగా తాజా నిర్ణయంతో మరింత దారుణ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.