మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని సదుద్దేశంతో రహదారుల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని రత్నాల చెరువు నుండి జాతీయ రహదారి వరకు రూ. 49. 70 లక్షల వ్యయంతో నిర్మించిన తారు రోడ్డు నిర్మాణంతో పాటు పుచ్చలపల్లి సుందరయ్య ముఖద్వారాన్ని మంగళవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తో కలిసి ప్రారంభించారు. తొలుత శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ నగర పరిధిలోని రత్నాల చెరువులో దశాబ్దాల తరబడి నివసిస్తున్న పేదలు వర్షాకాలంలో రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా 15వ ఆర్థిక సంఘం నిధులతో తారు రోడ్డు ను నిర్మించడం జరిగిందన్నారు. ఇక స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి గతంలో కమ్యూనిస్టు నేతలు కూడా ఎంతో కృషి చేశారని, వారి కృషికి గుర్తింపుగా ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ముఖం ద్వారాన్ని నిర్మించడం జరిగిందన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరిస్తే రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి, పట్టణ పార్టీ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు, ఎంటీఎంసీ కమిషనర్ శారదాదేవి, డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.