పొట్ట కూటికోసం సౌదీ అరేబియాకు వెళ్లి వీసా పద్ధతులు తెలియక తెలుగువాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. వారిలో అత్యధికులు సౌదీ అరేబియాలోనే చిక్కుకుపోవడమో, భారీ జరిమానాలకు గురికావడమో జరుగుతోంది.
ఇటీవల రంగారెడ్డి జిల్లా పార్వేడకు చెందిన 53 ఏళ్ల వ్యక్తిని సౌదీ నుంచి భారత్ వస్తుండగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు. విజిటర్స్ వీసా కాలపరిమితి కంటే రెండు నెలలు అధికంగా సౌదీలో ఉన్నాడంటూ భారత్ కు తిరిగివచ్చేందుకు అతడికి అనుమతి నిరాకరించారు.
గత కొంతకాలంగా ఇలాంటి ఉదంతాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని ఎన్నారై సామాజికవేత్త, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ప్రధాన కార్యదర్శి ముజామిల్ షేక్ వెల్లడించారు. చాలామంది సౌదీ వీసా నిబంధనలను పట్టించుకోవడంలేదని, వారు అన్ని విషయాలను ట్రావెల్ ఏజెంటుకే వదిలేస్తున్నారని వివరించారు. సదరు ట్రావెల్ ఏజెంట్లు కూడా వీసా నిబంధనలపై అవగాహన కలిగించడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ముజామిల్ ఆరోపించారు.
సౌదీ అరేబియా జారీ చేసే విజిటర్స్ వీసాలు రెండు రకాలు ఉంటాయని, ఒకటి ఫ్యామిలీ విజిట్ వీసా, రెండోది టూరిస్ట్ వీసా అని తెలిపారు. సందర్శకుల రాకపోకలను అనుమతించే ఈ రెండు వీసాలు ఒక ఏడాదిపాటు చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు. అయితే టూరిస్ట్ వీసా ఏడాది పాటు చెల్లుబాటు అయినా, ఒకసారి వస్తే దేశంలో మూడు నెలలు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తారని వివరించారు. ఇలాంటి అంశాలను తెలుగువాళ్లు విస్మరిస్తున్నారని, సౌదీ నియమనిబంధనలపై అవగాహన లేమి ప్రధాన సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు.
తాను ఇలాంటి 8 కేసులు పర్యవేక్షించానని, వాటిలో 6 కేసుల్లో తెలంగాణ నుంచి వచ్చినవారే ఉన్నారని ముజామిల్ షేక్ వెల్లడించారు. ఇక, జెడ్డా నగరంలో నివసించే మరో ఎన్నారై షెహజాద్ హుస్సేన్ స్పందిస్తూ... సౌదీలో కాలపరిమితికి మించి ఉంటున్నవారిలో హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే అత్యధికంగా ఉంటున్నారని, పలు ఉద్యోగ సంస్థలు వీరిని టూరిస్ట్ వీసాపై రియాద్ కు తీసుకువస్తున్నాయని వెల్లడించారు. ఈ ఐటీ నిపుణులను బిజినెస్ వీసా, లేక వర్క్ వీసాపై తీసుకువస్తే అధిక మొత్తంలో ఖర్చవుతుందని, అందుకే వారిని టూరిస్టు వీసాలపై తీసుకువస్తున్నారని వివరించారు.
ఇక ఆ ఐటీ నిపుణులు కూడా వీసా అనుమతించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటూ సమస్యల్లో చిక్కుకుంటున్నారని తెలిపారు. ఈ విధంగా జరినామానాకు గురైన వారిలో గుంటూరుకు చెందిన ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. వీసా పరిమితి ముగిసినా మూడు నెలలు అధికంగా అక్కడే ఉన్న వారికి గరిష్ఠంగా రూ.2.6 లక్షలు జరిమానా విధించారు. వీసా చెల్లుబాటుకు, దేశంలో ఉండేందుకు అనుమతించిన కాలపరిమితికి మధ్య తేడా తెలుసుకోలేక తెలుగు రాష్ట్రాల వారు ఇబ్బంది పడుతున్నారని షెహజాద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.