ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఏపీలోనూ 5జీ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతానికి తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు, ట్రూ 5జీ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి నాటికి ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు జియో తన 5జీ సేవలను విస్తరించనుంది.
నిన్న విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో జియో 5జీ సర్వీసులను ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తిరుమల, వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయని, అందుకోసం రిలయన్స్ సంస్థ రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ఏపీ పట్ల ఆ సంస్థకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని విజయసాయి వివరించారు. ఏపీలోని అన్ని మూలలకు 5జీ సేవలు విస్తరించాలని జియోను కోరుతున్నామని, ఇతర టెలికాం ఆపరేటర్లు కూడా ఏపీలో 5జీ విప్లవంలో పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తున్నామని తెలిపారు