ఏపీ సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సామాజిక పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరు గురించి సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. 'ప్రతి నెలా ఇచ్చే పించన్లను తగ్గించుకొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉంది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేశారు. పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటి వరకూ పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే నోటీసులు ఇచ్చారని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. అవ్వా.. తాతా... అంటూ. రూ.3 వేలు పెన్షన్ ఇస్తానని మీరు ఇచ్చిన హామీని ఈ విధంగా అమలు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. పెన్షన్ మొత్తం పెంచుతున్నాం కాబట్టి లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకోవాలి అనుకోవడం సరికాదు. సామాజిక పింఛన్ లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నాను. పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు.