మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఇప్పటం లో రూ. 13 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఇప్పటం లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి మంత్రి మురుగుడు హనుమంతరావు చేతులు మీదుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ నేపధ్యంలో కళ్యాణ మండపాన్ని సుమారు రూ. 80లక్షల వ్యయంతో పూర్తిస్థాయి హంగులతో తీర్చిదిద్ది ఇప్పటంతో పాటు పరిసర ప్రాంతాలైన వడ్డేశ్వరం, గుండిమెడ, కొలనుకొండ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలను పూర్తి స్థాయిలో, అతి తక్కువ ఖర్చుతో నిర్వహించుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. త్వరలోనే కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. కళ్యాణ మండపంతో పాటు వంగవీటి మోహన రంగా, గౌతు లచ్చన్న, చాకలి ఐలమ్మ పేర్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న అదే ఆవరణలోని భవనాలను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ఇక ఇప్పటంలో జగనన్న కాలనీలో నూటికి నూరుశాతం ఇళ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం గ్రావెల్ రోడ్లు, సిమెంటు రోడ్లు, సిమెంటు డ్రైనేజిల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి, డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.