ఏడాది తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే తన కుర్చీకి ఎసరు పెడుతున్నారంటూ తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా ధ్వజమెత్తారు. డక్కిలి మండలంలో గురువారం జరిగిన గ్రామ వలంటీర్ల సదస్సులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరిలో తాను ఎమ్మెల్యేనా? కాదా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని, వారికి మీరైనా క్లారిటీ ఇవ్వండి అంటూ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు సత్యనారాయణరెడ్డిని ఆనం కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే మరొకరు వెంకటగిరికి కాబోయే ఎమ్మెలేనంటూ ప్రచారం చేసుకోవడమేంటని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా మీరేమైనా కొత్త ఎమ్మెల్యేని పెట్టారా అని సత్యనారాయణరెడ్డిని అడగడంతో సభలో పాల్గొన్నవారంతా చప్పట్లు కొట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థినంటూ రంగంలోకి దిగి, సగం ఎన్నికల్లోనే పత్తా లేకుండా పారిపోయిన ఆ ప్రబుద్ధుడు ఇప్పుడు మళ్లీ వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నానంటూ ప్రచారం చేయడం చూస్తుంటే పార్టీని, ప్రజలను నట్టేట్లో ముంచడానికేనని ఆర్థమవుతోందని రాంకుమార్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వైసీపీలో రాజకీయాలు మ్యూజికల్ చైర్స్ ఆటలా మారాయని ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితుల్లో తాను ‘గడపగడపకూ’ ఎలా తిరగాలన్నారు. ఒకవేళ తిరిగినా ఎమ్మెల్యే తనా లేక మరొకాయనా అని ప్రజలకు కలిగే అనుమానాలు ఎవరు తీర్చాలన్నారు.