ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లను ఇంటి దగ్గర కూడా సద్వినియోగం చేసుకుని విద్యా ప్రమాణాలను పెంచుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. యడ్లపాడు మండలంలోని సొలస జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. 10 మంది విద్యార్థులను ర్యాండమ్‌గా ఎంపిక చేసి ఆంగ్లం, గణితంలో వారి సామర్థ్యాలను పరిశీలించారు.
ట్యాబ్‌ల ద్వారా గణితం చేయించారు. ఆంగ్లంలో మాట్లాడించారు. ఇద్దరు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పలేక పోవటాన్ని గుర్తించారు. విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ట్యాబ్‌ల ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలోని మౌలిక వసతులు పరిశీలించారు. విద్యాశాఖ యాప్‌లను తనిఖీ చేశారు. ఆర్వోప్లాంట్ పని చేయకపోవటంపై హెచ్‌ఎం ఈవీ శ్రీనివాసరావును ప్రశ్నించారు. 15 రోజులుగా పని చేయటం లేదని హెచ్‌ఎం తెలిపారు.