శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు, నార్పల తదితర మండలాల్లోని అరటి రైతులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. ప్రముఖ పత్రిక కథనం ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు సుమారు 14 వేల ఎకరాల్లో అరటి సాగు చేశారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. సిగటోక, ఇతర తెగుళ్లు సోకకుండా ఆరుగాలం శ్రమించి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వారి శ్రమకు ఫలితంగా ప్రస్తుతం పంట తొలి కోత ప్రారంభమైంది. ఎకరాకు 25 టన్నుల నుంచి 30 టన్నుల వరకు దిగుబడి రావచ్చని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం తొలి కోత టన్ను ధర రూ.28 వేల వరకు పలుకుతుండటం విశేషం. ఈ లెక్కన ఎకరాకు సుమారు రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఆరు సంవత్సరాల కిందట ఈ ధర పలికింది. ఆ తర్వాత ఎన్నడూ ఇంత ధర అందలేదు. ప్రస్తుతం ఉన్న ధర మరో మూడు నెలలు కొనసాగితే తమ కష్టాలు తీరుతాయని అన్నదాతలు ఆశిస్తున్నారు.
మన ప్రాంతంలోని అరటిని దేశాయి, ఐఎన్‌ఐ, ఎస్‌కే, వండర్‌బెర్రీ, డర్ధీ, చీతా తదితర కంపెనీలు అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ సుమారు 80 నుంచి 100 టన్నుల వరకు అరటిని ఏసీ వాహనాల్లో ముంబయికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఓడల్లో ఇరాన్, ఇరాక్, ఒమన్, దుబాయ్, ఖతార్, మస్కట్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.