నగరంలో కంచరపాలెం చెవిటి రాములవారి వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు సోమవారం అంబరానంటాయి. సాక్షాత్తు తిరుమలేశుడే దర్శనమిచ్చాడా అన్న విధంగా ఇక్కడి శ్రీ వెంకట రాంబాబు గణేష్ భక్త సమాజం నిర్వహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వారి ఆధ్వర్యంలో ఏటా ఘనంగా జరుగుతున్న వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి పూజలు 34 సంవత్సరానికి చేరుకున్నాయని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశామన్నారు. స్వామివారికి ప్రత్యేక పూలతో అలంకారంతోపాటు విద్యుత్ అలంకరణ చేశారు.
పరమానంద మాధవం బృందం భక్త వరద వెంకటేశ్వర స్వామి సహాకారంతో పూజాతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామునుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణతో ఏడుకొండల వాడిని దర్శించుకుని తరించారు. మధ్యాహ్నం చేపట్టిన అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తుల అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందుకున్నారు. అలాగే సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ఊరేగింపు మేల తాళాలతో, గరిడీ, గొల్ల కంచరపాలెం సింహాద్రి అప్పన్న పీఠం స్వాములు చేసిన భజనలు, సంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా జరిగింది.