యాడికి: ప్రభుత్వ సచివాలయాల్లో అనధికారికంగా విద్యుత్తు వాడకంపై ట్రాన్స్కో అధికారులు తాఖీదులు జారీ చేయనున్నట్లు తెలిసింది. యాడికి మండలంలో నెలలు దాటినా విద్యుత్తు మీటర్లు అమర్చుకోకుండా విద్యుత్తు వినియోగిస్తున్న ఏడు సచివాలయాలకు తాఖీదులు జారీ చేస్తామని ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజినీరు రాజరావు చెప్పారు. మండల వ్యాప్తంగా మొత్తం 16 సచివాలయాలు ఉండగా. యాడికిలో మూడు, నిట్టూరు, కోన ఉప్పలపాడు, గుడిపాడు, కమలపాడుల్లో నూతన భవనాల్లో ప్రారంభమ య్యాయి. ఇక్కడ కొన్ని నెలలుగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ సమయాల్లో అనధికారంగా కనెక్షన్లు తీసుకుని విద్యుత్తు వినియోగించుకునేవారు. సచివాలయాలు ప్రారంభమైనా అవే కనెక్షన్లతో విద్యుత్తును విని యోగించుకుంటున్నారు. ఈ విషయంపై మంగళవారం ఎంపీడీఓ వెంకటేశ్ తొ చర్చించామని, వారంలోగా మీటర్లు బిగించుకోకపోతే విద్యుత్తు కనెక్షన్లు తొలగిస్తామని ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజినీరు తెలిపారు.