ఒక పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని, చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ పోతోందని, బాబులాగే ఆయన కార్యకర్తలూ ఉన్నారని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. అనుమతి లేని రోడ్డు షోలు, సభ పేరుతో కుప్పంలో రౌడీయిజం చేశాడని, ప్రశ్నించిన పోలీసులపైకి కార్యకర్తలను ఉసిగొల్పి పంపి దౌర్జన్యం చేయించడం మంచిది కాదన్నారు. చంద్రబాబు కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో నిర్వహించిన సభల వల్ల మొత్తం 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయాలపాలయ్యారన్నారు. ఆ రెండు ఘటనలకు చంద్రబాబే కారకుడని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సోమల మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.