చలికాలం నేపథ్యంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో గల పలు గ్రామాల్లో పొగ మంచు విపరీతంగా కురియడంతో గ్రామీణ ప్రాంతాలు మంచు దుప్పటిను కప్పుకుంటున్నాయి. ఇటీవల గత మూడు రోజుల నుండి శృంగవరపుకోట మండలంలో ప్రతిరోజు ఉదయం పొగ మంచు కురుస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికమవుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో చలి తీవ్రతతో పాటు పొగ మంచు కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజామున రాకపోకలు సాగించే ప్రయాణికులు పొగ మంచు కారణంగా రహదారి సరిగా కనిపించకపోవడంతో ఎక్కడ ప్రమాదాలు బారిన పడతారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలి తీవ్రత అధికమవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పొగ మంచు కారణంగా గ్రామీణ ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్న దృశ్యాలు చూసేందుకు మనోహరంగా ఉన్నప్పటికీ ప్రయాణికులు అలాగే ప్రజలు ఒకింత ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు అంటున్నారు.