రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. రైతు నుంచి కొనుగోలు చేసిన దగ్గర నుంచి మిల్లులకు ధాన్యం చేరే వరకు పూర్తి పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపు విషయంలో చిన్న సమస్య కూడా ఉత్పన్నం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. దళారీల బెడద లేకుండా రైతులకు అన్ని రకాల సేవలు అందించాలని పేర్కొన్నారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎలాంటి సమస్యా రాకుండా చూసుకోవాలని చెప్పారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయన జాయింట్ కలెక్టర్ మయూర అశోక్, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనుసరించాల్సిన సులభతర విధానాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
రైతుల నుంచి సేకరించిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యం మొత్తం కేవలం ప్రైవేట్ మిల్లుల వద్దే కాకుండా ఎఫ్. సి. ఐ. గోదాములకు కూడా తరలించాలని అధికారులను ఆదేశించారు. కాలయాపన జరగకుండా వెనువెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, ఈ ప్రక్రియలో జరిగే ప్రతి దశపై రైతులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించాలని సూచించారు. బిల్లుల చెల్లింపులు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.