తాలిబన్లు ఓ అద్భుతం చేసి చూపించారు. ఏకంగా అందమైన కారును తయారు చేశారు. తాలిబన్లు అనగానే గుర్తుకొచ్చేది చేతిలో ఆయుధాలు.. మత ఛాందసవాదానికి మారుపేరు తాలిబన్లు. అమ్మాయిలు బడికెళ్లొద్దంటారు.. మగాళ్లు గడ్డం తీయొద్దంటారు. అందుకే తాలిబన్ల పాలన మధ్యయుగం నాటి పరిస్థితులను తలపిస్తుందనేది చాలా మంది భావన. కానీ ఒకప్పటితో పోలిస్తే.. ప్రస్తుతం తాలిబన్లలో కొంత మార్పు కనిపిస్తోంది. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని చాటాలని తాలిబన్లు కోరుకుంటున్నారు. వారి పాలనలో ఉన్న అప్ఘానిస్థాన్ తొలిసారి దేశీయంగా ఓ సూపర్ కారును తయారు చేయడమే దీనికి నిదర్శనం. ఆ సూపర్ కార్‌కు మడా 9 అనే పేరు పెట్టారు. ఈ కారు లుక్ చూస్తుంటే.. బుగాటీ, లాంబొర్గిని, ఫెరారీ లాంటి సూపర్ కార్లకు పోటీనిచ్చేలా ఉండటం గమనార్హం.
ఇప్పటికీ ప్రొటోటైప్ దశలోనే ఉన్న సూపర్ కారును అభివృద్ధి చేయడానికి ఐదేళ్లకుపైగా సమయం పట్టింది. ఎన్‌టాప్, కాబుల్‌లోని అప్ఘానిస్థాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీవీఐ)కి చెందిన 30 మంది ఇంజినీర్లు ఈ కారును తయారు చేశారు. ఈ మడా 9 సూపర్ కారులో టొయోటా కొరొల్లా ఇంజిన్ వాడారు. ఈ కారు పనితనానికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఎన్‌టాప్ ప్రధాన కార్యాయంలో బుధవారం ఈ కారును ఆవిష్కరించారు.
తమ ప్రజలకు మతంతోపాటు ఆధునిక శాస్త్రాలను సైతం అధించడానికి తాలిబన్ల పాలన కట్టుబడి ఉందని నిరూపించడానికి ఈ కారే నిదర్శనమని తాలిబన్ల ఉన్నత విద్య శాఖ మంత్రి అబ్దుల్ బఖీ హఖ్ఖానీ తెలిపారు. ప్రపంచ వేదికగా అప్ఘానిస్థాన్ ఇమేజ్‌ను పెంచడానికి ఈ కారు దోహదం చేస్తుందని కారు ఉత్పత్తి చేసిన సంస్థ ‘ఎన్‌టాప్’ సీఈవో మహ్మద్ రిజా అహ్మదీ తెలిపారు.
ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయాలను ఇంకా వెల్లడించలేదు. ముందుగా అప్ఘానిస్థాన్ మార్కెట్లోకి ఈ కారును రిలీజ్ చేస్తామని.. తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తామని రిజా తెలిపారు. మడా 9ను ఇప్పటికే పరీక్షించారు. ఈ కారు తయారీ తమ దేశానికి గౌరవమని పేర్కొంటూ.. మడా 9 ఫొటోలను తాలిబన్ల అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.