వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. ఎన్నికలకు చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఖరారు అవుతారని.. సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో నాని కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
చివరి మూడు నెలల్లో రాజకీయంగా పరిస్థితులు మారిపోతాయన్నారు నాని. ప్రభుత్వం మారాలంటే సీనియర్లంతా త్యాగాలకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. తానే సామంతరాజుననే ఇగో, పొగరుని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ వస్తుందన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. జగన్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవాలంటే తనతో సహా అందరూ త్యాగాలకు సిద్ధం కాకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. తాను రెండుసార్లు ఎంపీగా గెలిచానని.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. తనకు ఎంపీగా ప్రజలు అవకాశం ఇచ్చారని.. వారి కోసం పనిచేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
కలుపుకెళ్లడం అనేది రెండు వైపులా ఉండాలని.. ఐలవ్ యు.. యు డోంట్ లవ్ మి అంటే కుదరదు అన్నారు. తానే సామంతరాజునని బిల్డప్ ఇస్తే కృష్ణానదిలో ఈడ్చికొడతారని.. ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిలిచినా తాను వెళ్తాను అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యల్ని బట్టి దేవినేని ఉమాపై పరోక్షంగా సెటైర్లు వేశారనే చర్చ జరుగుతోంది.. అలాగే ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై చురకలంటించారు.
కొద్దిరోజులుగా మైలవరం టీడీపీలో రాజకీయాలు హీట్ పెంచాయి. మాజీ మంత్రి దేవినేని ఉమాకు వ్యతిరేక వర్గం కొద్దిరోజులుగా దూకుడు పెంచింది. గొల్లపూడికి చెందిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు యాక్టివ్ అయ్యారు. ఈ మధ్యే బొమ్మసాని ఓ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం టిక్కెట్ స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్‌ను తీసుకొచ్చారు. పరోక్షంగా దేవినేని ఉమాను టార్గెట్ చేశారు.
బొమ్మసాని సుబ్బారావు కాంగ్రెస్ సీనియర్ నేతగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆయన.. మైలవరం సీటు వస్తుందని భావించారు. కానీ సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి ఓడిపయారు.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరారు. 2019లో కూడా టికెట్ ఆశించినా నిరాశ తప్పలేదు. ఈసారి మైలవరం నుంచి తాను కూడా రేసులో ఉన్నానని బొమ్మసాని సంకేతాలు పంపుతున్నారు. ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే కేశినేని నాని పాల్గొన్నారు.