కేరళ బాలల హక్కుల కమిషన్ తాజాగా ఓ ఆసక్తికర ఆదేశం ఇచ్చింది. పాఠశాలల్లో మనం ఉపాధ్యాయులను ఏమని సంభోదిస్తాం. పురుష ఉపాధ్యాయలనైతే సార్ అని.. ఉపాధ్యాయురాలినైతే మేడం అని పిలుస్తాం. ఇకపై అలా పిలవటానికి వీల్లేదు. ఉపాధ్యాయులను 'సర్' లేదా 'మేడమ్' అని కాకుండా 'టీచర్' అని పిలవాలి. ఈ మేరకు కేరళ బాలల హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి దశలోనే పిల్లలకు స్త్రీ, పురుషులిద్దరూ సమానమే (లింగ సమానత్వం) అని చెప్పేందుకే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు బాలల హక్కుల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్’ అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సాధారణ విద్యాశాఖను ఆదేశించింది. ఉపధ్యాయులు లింగ వివక్షకు గురి కాకుండా సార్ లేదా మేడం పదాలకు స్వస్తి చెప్పాలంటూ ఓ వ్యక్తి పిటిషను దాఖలు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
"సార్ లేదా మేడమ్ అనే పదాలు ఉపాధ్యాయుని సరైన భావనతో సరిపోలటం లేదు. ఆ పదాలకు బదులుగా పిటిషనర్ పేర్కొన్న విధంగా టీచర్ అనే పదం ఉపయోగిస్తే ఉపాధ్యాయలను విద్యార్థులకు మరింత దగ్గర చేసే అవకాశం ఉంటుంది. అలాగే వారిలో లింగ సమానత్వంపై అవగాహన పెరుగుంతుంది." అని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సాధారణ విద్యా శాఖ డైరెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.