పంగులూరు మండలంలోని కొండమంజులూరులో జరుగుతున్న ఆలిండియా కృష్ణచైతన్య ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో జీఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్టు, గుజరాత్ లైన్స్ గుజరాత్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ లైన్స్ గుజరాత్ జట్టు 19.1. ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు 4 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ జట్టులోని గంగా అనే క్రీడాకారుడు 29 బంతులలో 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 44 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ఏలూరీస్ సౌత్‌జోన్ సీసీ చెన్నై, జీబీఆర్ హాస్పటల్స్ ఏపీ జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జీబీఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఏలూరీస్ జట్టు 16.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించి సెమీ్‌సకు చేరింది ఈ జట్టులోని జీవన్‌ధామ్ నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీనివా్‌సనాయక్, దీపక్, నాగేంద్రబాబు, ఎంవీకే నాయుడు వ్యవహరించారు.