అవినీతిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉక్కుపాదం మోపారు. నెల్లూరు జిల్లా రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులపై వరుసగా వేటు పడుతోంది. ఇటీవల బుచ్చిరెడ్డిపాళెం ఎమ్మార్వో ప్రమీలను సస్పెండ్ చేసిన కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు.. తాజాగా వెంకటాచలం ఎమ్మార్వో నాగరాజు, తోటపల్లి గూడూరు ఎమ్మార్వో హమీద్, గుడ్లూరు ఎమ్మార్వో లావణ్యను సస్పండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతికి అలవాటుపడ్డ అధికారులు.. రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చూపించి పరిహారం ఇవ్వడం, చివరికి మర్రిపాడు ప్రాంతంలో అటవీ శాఖ భూములను సైతం పట్టా భూములుగా చూపడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఎమ్మార్వోల అవినీతిపై చివరికి స్పందన కార్యక్రమంలో సైతం ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు విచారణాధికారిగా జేసీ కూర్మనాథ్‌ను నియమించారు.
జేసీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. కలువాయి మండలంలో ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులదిగా చూపించి అక్రమార్కులకు అండగా నిలిచారు. గుడ్లూరు మండలంలో ప్రభుత్వ భూమిని మ్యుటేషన్ చేశారు. ఇలా పలుచోట్ల అక్రమాలకు పాల్పడ్డ ఎమ్మార్వోలను గుర్తించి సస్పెండ్ వేటు వేశారు.
ఒక్క రోజే ముగ్గురు ఎమ్మార్వోలను సస్పెండ్ చేయడం రెవెన్యూ శాఖలో కలకలం రేగింది. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరో ఆరుగురిని విచారించేందుకు జేసీ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరికొంత మందిపై వేటు పడే ఛాన్స్ ఉంది.