మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నాయకత్వం ఫోకస్ ఫెట్టింది. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును, లోకేష్‌ను.. కొడాలి నాని తీవ్రంగా విమర్శిస్తారు. చెప్పుకోలేని బాషలో ఫైర్ అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ప్రథమ శత్రువుగా మారారు. ఈ నేపథ్యంలో.. ఆయన్ను ఓడించాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. 2014, 2019లో తీవ్రంగా శ్రమించారు. కానీ.. అనుకున్న ఫలితం రాలేదు కదా.. కొడాలి నాని క్రేజ్ ఇంకా పెరిగింది. దీంతో ఆయన ఇంకా దూకుడు పెంచారు. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుపై దండయాత్ర చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. 2024 ఎన్నికల్లో ఎలాగైన కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆయన్ను ఓడించే లీడర్ ఎవరనేది మాత్రం టీడీపీ ఇంకా తేల్చుకోలేక పోతోంది. 2019లో దేవినేని అవినాష్‌ను ప్రయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఆయన ఉంటారు అనుకున్నా.. అదీ జరగలేదు. ప్రస్తుతం అవినాష్ వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. విజయవాడ తూర్పుపై ఫోకస్ పెట్టారు. దీంతో మళ్లీ టీడీపీకి లీడర్ల కొరత ఏర్పడింది.
సరిగ్గా ఇదే సమయంలో.. రావి వెంకటేశ్వర రావు మళ్లీ తెరపైకి వచ్చారు. వివిధ కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. సడెన్‌గా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పేరు గుడివాడలో మారుమోగుతోంది. ఇది రావి వెంకటేశ్వర రావుకు మింగుడు పడటం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ రావి వెంకటేశ్వర రావు పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థికంగా చితికిపోయారు. అయినా.. 2024లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు. ఇలాంటి సమయంలో.. రాముకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈసారి అవకాశం రాకపోతే.. మళ్లీ భవిష్యత్తులో కష్టం అనే అభిప్రాయంలో రావి వెంకటేశ్వర రావు ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయన వెనిగండ్ల రామును కలుపుకొని వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈసారి రావికి కాకుండా.. వెనిగండ్ల రాముకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పిన్నమనేని వర్గం వెనిగండ్ల రాముకు మద్దతుగా నిలుస్తోంది. దీంతో ఈసారి కూడా రావి వెంకటేశ్వర రావుకు ఛాన్స్ రాకపోవచ్చు అని అంటున్నారు. దీంతో గుడివాడలో టీడీపీ కార్యక్రమాలు రెండు వర్గాలుగా విడిపోయి జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి సందర్భంలో కొడాలి నానిని దెబ్బ కొట్టడానికి కలిసి పని చేయాలని చంద్రబాబు ఆదేశించారట. అయినా.. రావి మాత్రం కలిసి రావడానికి సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. 2019లో తనకు ఛాన్స్ ఇస్తారని చెప్పి.. అవినాష్‌కు ఇచ్చారని.. ఈసారి కూడా రాముకు ఇస్తే.. తన పరిస్థితి ఏంటని రావి వెంకటేశ్వర రావు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మొత్తానికి గుడివాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ పోరు.. వైఎస్సార్సీపీకి ప్లస్ అయ్యేట్టు ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే.. 2024లో కూడా కొడాలి నానినే గెలుస్తారనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.