పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని సత్తివానిపాలెం శివారు కొండవాలు ప్రాంతంలోని నీటి మడుగులో దిగిన ఓ యువకుడు గల్లంతైన సంఘటనపై పెందుర్తి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దువ్వాడ ప్రాంతానికి చెందిన యశ్వంత్ (20) అనే యువకుడు ఫకీర్‌తక్యాకు చెందిన కొందరు మైనర్ బాలురుతో కలిసి సత్తివానిపాలెం శివారులోని కొండవాలు ప్రాంతంలో వున్న క్వారీ వద్దకు బుధవారం సాయంత్రం వచ్చారు. ఇక్కడి కొండవాలు ప్రాంతంలో క్వారీ తవ్వకాలు చేపట్టిన చోట ఏర్పడిన నీటి మడుగులోకి యశ్వంత్ అనే యువకుడు దిగి గల్లంతయ్యాడు. దీంతో సమీపంలో వున్నవారు ‘100’కు డయల్ చేసి సమాచారం అందజేశారు.
అయితే సంఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించలేకపోవడంతో ఫకీర్‌తక్యా గ్రామానికి వెళ్లి విచారించారు. గల్లంతైన యువకుడితో పాటు కొందరు మైనర్ బాలురు ఫొటోలు తీసుకునేందుకు గాను కొండవాలు ప్రాంతానికి రాగా ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సంఘటనా స్థలికి రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీసులు చేరుకుని పరిశీలించారు. అయితే నీటి మడుగులో బురద వుండడంతో యశ్వంత్ ఊబిలో చిక్కుకుని వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. కాగా యువకుడి గల్లంతుపై వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.