ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే నిన్నటి వరకు చైనా అని చెప్పుకునేవాళ్లం. ఇక నుంచి ఆ పేరు కనుమరుగవుతోంది. తెరపైకి భారత్ దేశం వచ్చిచేరింది. తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నిర్వహించిన సర్వేలో చైనా జనాభాకంటే భారత దేశం జనాభా ఎక్కువని అంచనా వేసింది. గత ఏడాది డిసెంబర్ నెల నాటికి డబ్ల్యూపీఆర్ అంచనా ప్రకారం.. చైనా కంటే భారత్ లో 50లక్షల మంది అధికంగా జనాభా ఉందని అంచనా వేసింది. అయితే, మన దేశ జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. పదేళ్లకోసారి ఆనవాయితీ ప్రకారం మన దేశంలో జనాభా గణన జరగాలి. కానీ, 2020లో కరోనా కారణంగా జనాభా గణన వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారికంగా ప్రస్తుతం భారతదేశ జనాభా గణాంకాలు అందుబాటులో లేవు. పలు సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మొదటి స్థానంకు చేరిందని అంచనా వేస్తున్నాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం.. 2023 జనవరి 18 నాటికి భారత జనాభా 142.3 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. మాక్రోట్రెండ్స్ కూడా ప్రస్తుతం భారత జనాభా 142.8 కోట్లుగా తేల్చింది. చైనా తమ జనాభా 141.2 కోట్లని తెలిపింది. దీంతో భారత్ జనాభాలో నెం.1గా అవతరించినట్లు ఆయా సంస్థలు భావిస్తున్నాయి.