పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా పదవి బాధ్యతలు చేపట్టిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వారం రోజుల లోపే తన మార్కు చూపారు. కారంచేడు మండలం దగ్గుబాడులో ఆ గ్రామ ప్రజా ప్రతినిధి ఒకరు సాగిస్తున్న మట్టి దందాకు ఆయన చెక్ పెట్టారు.దగ్గుబాడు లో రెండు మంచినీటి చెరువులు ఉండగా అవి పూడుకుపోయాయని, వాటిని వెడల్పు చేయటానికి పూడిక తీస్తున్నామని చెబుతూ సదరు ప్రజాప్రతినిధి ఏడాదికాలంగా తన ఇష్టానుసారం మట్టిని తవ్వుకొని అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయమై గతంలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా ఎవరూ ఆ చెరువుల దగ్గరకు వెళ్లడానికి కూడా సాహసించలేదు. ఆ వార్తలు రాసిన విలేకరులపై కూడా సదరు ప్రజా ప్రతినిధి బెదిరింపులకు దిగాడు.
ఈ విషయం తెలియగానే ఆమంచి తన తొలి నియోజకవర్గ పర్యటనే దగ్గుబాడు నుండి ప్రారంభించారు. మంచినీటి చెరువులు పరిశీలించారు. గ్రామస్తుల మొర ఆలకించారు. వెంటనే పోలీసులకు తగిన ఆదేశాలను ఆమంచి కృష్ణమోహన్ జారీ చేశారు. దీంతో కారంచేడు ఎస్సై అనిత బుధవారం మెరుపు దాడి చేసి మట్టిని తవ్వుతున్న జెసిబిని, దాన్ని లోడ్ చేసుకుంటున్న నాలుగు టిప్పర్లను స్వాధీన పరుచుకున్నారు. ఇదే పనిని గతంలో పోలీసులు చేయలేకపోవడాన్ని గ్రామస్తులు ప్రస్తావిస్తూ ఆమంచికే ఇది సాధ్యపడిందని ప్రశంసిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గం ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కూడా అడ్డాగా మారిన నేపథ్యంలో ఆమంచి ఏం చేస్తారా అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు