భార్య ను తీసుకొచ్చేందుకు అత్తవారింటికి వెళ్తున్న ఆ వ్యక్తిని బొలారో రూపంలో మృత్యువు కబళించింది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం అక్కురాడ గ్రామానికి చెందిన ముంజేటి మోహనరావు (40) మృతిచెందాడు. మోహనరావుకు తల్లిదండ్రులు సత్యవతి, అప్పారావు, భార్య కృష్ణవేణి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను బుడితి కూడలిలోని పెట్రోల్ బంక్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంక్రాంతి కోసం కృష్ణవేణి తన పిల్లలతో కలిసి కన్నవారి గ్రామం బైరి సింగుపురం సమీపంలోని రోణంకి వెళ్లారు. వీరిని తీసుకొచ్చేందుకు మోహనరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నారాయణవలస సంత వద్ద ఎదురుగా వస్తున్న బోలారో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మోహనరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ షేక్జాన్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.