మూడున్నరేళ్లుగా ప్రజలపై పడుతున్న విద్యుత్ భారాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నోరు విప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల 2023-24 వార్షికాదాయ వ్యయ ప్రతిపాదనల్లో రూ.12,792 కోట్ల లోటును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్ ప్రకటించాలని కోరారు. విద్యుత్ చార్జీల భారంపై బుధవారం విజయవాడలోని మొగల్రాజపురం, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం ప్రాంతాల్లో సీపీఎం నేతలు ఇంటింటికీ పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష నేతగా ట్రూఅప్ చార్జీలను వ్యతిరేకించిన జగన్ నేడు అదే పేరుతో రూ.2,820 కోట్లు వసూలు చేయడం సిగ్గుచేటు. విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పులు తెచ్చి వడ్డీల భారాలను ప్రజలపై వేస్తుంటే వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? సీఎం స్పందించి భారాలు తగ్గించాలి. లేని పక్షంలో విద్యుత్ భారాలపై ప్రజా ఉద్యమం తప్పదు’’ అని హెచ్చరించారు. అధికారంలోకొస్తే విద్యుత్ బాదుడు ఉండదని, 200 యూనిట్లలోపు వినియోగించుకునే అన్ని తరగతుల వారికీ ఉచితంగా విద్యుత్ అందిస్తామని మాట ఇచ్చిన జగన్.. నేడు మాట తప్పి పేదలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు. శ్లాబుల మార్పుతో పేదలపై అధిక భారం పడిందని అన్నారు. మూడున్నరేళ్లలో ప్రజల కళ్లుగప్పి వివిధ రూపాల్లో జగన్ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపిందని ప్రజలు బాబూరావు బృందం ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్రాజపురంలో కనీస బిల్లు రూ.26.60కు కొసరు చార్జీలు రూ.180తో కలుపుకుని రూ.208 బిల్లు వచ్చిందని సీపీఎం బృందం గుర్తించింది.