తూర్పు గోదావరి జిల్లా,కొవ్వూరు 19 వార్డు ఇందిరమ్మకాలనీలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనితకు సమస్యలు వెల్లువెత్తాయి. గోక శోభారాణి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కింద రూ. 1,27,020లు లబ్ధి చేకూరిందని మంత్రి తెలుపగా.. శోభారాణి మాకు రాలేదని బదులిచ్చారు. తన భర్త జగన్నాథంకు కరోనా సోకడంతో విజయవాడ ఆసుపత్రిలో చేర్పించి సుమారు రూ. కోటి అప్పుచేసి ఖర్చు చేసినా చనిపోయారన్నారు. కరోనాతో చనిపోయినందుకు రూ. 50 వేలు మాత్రమే వచ్చిందని.. ఆరోగ్యశ్రీ కింద వినియోగించుకోలేదన్నారు. దిండి దుర్గాప్రసాద్ బైక్ యాక్సిడెంటు జరిగి కదలలేని స్థితిలో ఇంటిలోనే ఉంటున్నాడు.పింఛను మంజూరు చేయాలని తల్లి శేషవేణి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందిరమ్మ కాలనీల్లో చాలా మందికి ఇంకనూ పట్టాలు పంపిణీ చేయలేదని పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి వనిత మాట్లాడుతూ.... కాలనీలో 1600 కుటుంబాలు నివసిస్తున్నాయని, పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.