మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ పి రాజాబాబు ఆదేశాల మేరకు నగరంలో ప్లాస్టిక్ బ్యానర్లు నిషేధిస్తున్నట్లు జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసి రావు పేర్కొన్నారు. శనివారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్జి శాస్త్రి, నగరంలోని ఫ్లెక్షీ బ్యానర్లు ప్రింటింగ్ వ్యాపారస్తులు, వారి ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్లాస్టిక్ బ్యానర్లు నగరంలో నిషేధిస్తున్నామని ఈ నెల జనవరి 26వ తేదీ నుండి బ్యానర్లు ప్రింటింగ్ దుకాణాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని నగరంలో జి-20 సదస్సు మార్చి నెలలో జరుగుతున్న దృష్ట్యా దేశవిదేశాల నుండి సుమారు 200 మంది ప్రతినిధులు వస్తారని అందుకు నగరాన్ని సుందరంగా ఉంచాల్సిన బాధ్యత మనదేనని, ప్లాస్టిక్ బ్యానర్లు తయారీదార్లు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గమైన క్లాత్ బ్యానర్లను ఉపయోగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఎంఓహెచ్ డాక్టర్ ఎన్ కిషోర్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శంకర రావు, ఫ్లెక్షీ బ్యానర్ల అసోషియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.