సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్యరోజున సంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా నేత్ర పర్వంగా నిర్వహించారు. తొలుత సింహాద్రినాథుడు ఉత్సవమూర్తి ప్రతినిధిగా గోవిందరాజ స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా అలంకరించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు నడుమ మెట్ల మార్గం ద్వారా బోయీలు స్వామిని కొండ దిగువకు తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అధికారులు , గ్రామ పెద్దలు, ధర్మ కర్తల మండలి సభ్యులు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి సాదరంగా గ్రామంలోకి స్వామి, అమ్మవార్లను ఆహ్వానించారు. అక్కడి నుంచి నేరుగా వరాహ పుష్కరణి వద్దకు చేరుకున్న స్వామి ఉభయ దేవేరులతో కలిసి హంస వాహనంపై విహారం చేశారు. వరాహ పుష్కరణి మధ్యలో ఉన్న ఆలయ ఆస్థాన కళ్యాణ మండపంలో. విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ స్థానాచార్యులు టి. పి. రాజగోపాల్ ఉత్సవ విశిష్టతను తెలియజేశారు. అమావాస్య రోజు స్వామి అందర్నీ ఆశీర్వదించేందుకే హంస వాహనంపై విహారం చేస్తారని వివరించారు. తెప్పోత్సవం పూర్తికాగానే స్వామిని నేరుగా పుష్కరణి సత్రంలో ఆశీనులను చేసి ఉయ్యాల సేవ జరిపారు. అక్కడినుంచి సర్వజన మనోరంజక వాహనంపై గ్రామములో తిరువీధి కార్యక్రమం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ ఇళ్ళ ముంగిట అందమైన ముగ్గులు వేసి స్వామిని సాధారంగా స్వాగతించారు. ప్రజలు మంగళ హారతులతో విశేష పూజలు జరిపి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఇఓ త్రినాధరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బారీగా భక్తులు పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండల సభ్యులు గంట్ల శ్రీనుబాబు, దినేశ్ రాజ్, పాత్రుడు, శ్రీదేవివర్మ, రాజేశ్వరి, శ్రీదేవి, రామలక్ష్మి, వంకాయల నిర్మల, ప్రత్యేక అహ్వనితులు చందు యాదవ్, గేదెల వరలక్ష్మి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.