‘‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా కుట్ర చేస్తోంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఈనెల 27న ఉదయం 11.20 గంటలకు యాత్ర మొదలై తీరుతుంది’’ అని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడారు. ‘‘లోకేశ్ పాదయాత్ర చేస్తారని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం అనేక కుట్ర లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ర్యాలీలు, రోడ్‌షోలు నిషేధిస్తూ జీవో నంబరు-1 తీసుకువచ్చింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి దరఖాస్తు చేసినా ఆమోదం తెలపలేదు. లోకేశ్ పాదయాత్రపై ఇప్పటికే ప్రజల్లో ఆసక్తి పెరిగిందనే విషయాన్ని గుర్తించిన జగన్మోహన్‌రెడ్డి భయపడుతున్నారన్నారు. ఇచ్చిన దరఖాస్తు మేరకు అనుమతి ఇస్తే మంచిది... లేకపోతే ముందుగా పెట్టుకున్న ముహూర్తానికే లోకేశ్ పాదయాత్ర జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. లోకేశ్‌కు ప్రాణహాని ఉంది. అందువల్ల కేంద్ర బలగాల భద్రత కల్పించాలి’’ అన్నారు.